Thursday, 14 September 2017

గురువు- గురుపూజ- గురుదక్షిణ

భగవాధ్వజం సార్వదేశికం. ఏకతకు ప్రతీక. రాష్ట్రం, సంస్కృతి, పరంపర, చరిత్ర, బలిదానం, సేవకు ప్రతీక. యుద్ధానికీ ప్రతీక.

గురుకృప లేనిదే జ్ఞానం కలగదు. భక్తి జాగృతం కాదు. కర్మచేసే క్షమత రాదు. ఈశ్వర సాక్షాత్కారం కలగదు.

బ్రహ్మచర్యాశ్రమంలో గురువు వద్ద పొందిన గుణాల వల్ల భావి జీవితం నిర్మాణమవుతుంది- రాముడు, కృష్ణుడు.
భీష్ముడు వంశోద్ధరణ కోసం, ద్రోణుడు వృత్తిగా, అర్జునుడు ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి కావాలనే కాంక్షతో ధనుర్విద్య అభ్యసించారు. ఏకలవ్యుడు మాత్రం సాధు జంతువులను, తన గూడెం ప్రజలను క్రూర జంతువులనుండి కాపాడుకోవడం కోసం ధనుర్విద్య అభ్యసించాడు.( జీవన ఉద్దేశాన్ని బట్టి జీవన పరిణామం ఏర్పడుతుంది)

' గురు ' అంటే బృహస్పతి అనే పర్యాయ అర్థం కూడా ఉంది.

గురువు అవడం అనేది నిరంతర ప్రక్రియ. అటువంటపుడు శిష్యత్వం కూడా నిరంతరమే.

గురువు శిష్యుడు కావడమనేది గుణాత్మక ప్రక్రియ. శిష్యుడు గురువు అయ్యే ప్రయత్నం సాధనా ప్రక్రియ.

మనం సాధించలేని ప్రక్రియకు సంకేతంగా గురువు ఉండకూడదు. అలా ఉంటే మనం నిరంతరం శిష్యుడిగానే ఉండిపోతాం. గురువుగా మారలేం.

గురువు భూలోక మానవులకే కాదు. దేవలోక దేవతలకూ ఉండేవాడు.

మనిషిని సృష్టించడం దేవుడి ధర్మం కాగా మనిషిని మహాత్ముడిగా పరివర్తన చేయడం గురువు ధర్మం.

గురుశిష్యుల విషయంలో రెండు న్యాయాలు. ఒకటి మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లను మునిపళ్ళతో పట్టుకుని పోతుంది. ఇందులో మార్జాల కిశోరం(పిల్లి పిల్ల) బాధ్యత ఎంత మాత్రం లేదు. బాధ్యత సాంతం తల్లిదే. కృష్ణార్జునులలో  కృష్ణుడే అర్జునునికి జ్ఞానం బోధించే బాధ్యత స్వీకరించాడు. అర్జునుడు కనీసం అర్థించలేదు.

రెండవ న్యాయం మర్కట కిశోర న్యాయం. కోతిపిల్ల, తల్లి కడుపును కరచి పట్టుకుంటుంది, వదలదు. తల్లి బిడ్డను పట్టుకోదు. ఇందులో బాధ్యత సాంతం మర్కట కిశోరం( కోతి పిల్ల) దే. తల్లి బాధ్యత లేదు. గురువునుండి ఏదైనా పొందాలనుకుంటే,  అది సాధించే బాధ్యత శిష్యుడిదే. ఉపదేశించడం మాత్రమే గురువు బాధ్యత.

 శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది సార్లు తన గురువైన తిరుకొట్యూరు నంబి వద్దకెళ్ళి తిరుమంత్రం ఉపదేశించమని కోరాడు. అపుడు వారిది మర్కటకిశోర న్యాయం. తిరుమంత్రాన్ని  జనాలందరికీ గోపురం మీదనుంచి అరచి ఉపదేశించినప్పటిది మార్జాలకిశోర న్యాయం.

గురువును శిష్యుడు తత్త్వం తెలుసుకోవడానికి ఆశ్రయించాలి.

ఒక పండితుణ్ణి అవమానించినందుకు నందవంశం నాశనమైంది. అటువంటి చాణక్య గురుపరంపరకు చెందినవారు గురువులు.

గురువు అవమానించబడినందుకు ద్రుపదుడిని బంధించి తెచ్చి గురువుకు గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. అటువంటి అర్జున శిష్యపరంపరకు చెందినది మన జాతి.

పాలలో ఎన్ని పాలు గుమ్మరించినా తోడుకోవు, చిటికెడు పెరుగు కావాల్సిందే. గురువు ఆ పెరుగులాంటి వాడే. జీవితానికి ఓ అర్థాన్ని ప్రసాదిస్తాడు.

గురుదక్షిణ సమర్పణ భావనకు ప్రతీక.

గురుదక్షిణ మన ఆదాయంలో 12 వ భాగం. 24 వ భాగం నుండి ప్రారంభించాలి. సంపాదనలో 1/10 వ భాగం సమాజం కోసం అనేది ప్రాచీన భావన.

గురుదక్షిణ దానం కాదు. తలవంచి సమర్పించాలి. దానం తీసుకోవడం వల్ల భగవంతుడు కూడా వామనుడయ్యాడు.

గురుదక్షిణ అనేది వ్యక్తిగతం, రహస్యం కాదు.

సంఘ ధ్యేయవాక్యం  " స్వయమేవ మృగేంద్రతా " . ఆ ప్రకారమే స్వయంసేవకులు తమ సంస్థను తామే నడుపుకోవడానికి గురుదక్షిణ.

సమర్పణ అనేది కేవలం సంఘానికే కాదు, అవసరమైతే సమాజానికి కూడా అనే భావన పెంచడానికే.

గురుదక్షిణగా మన పూర్వీకులు చెల్లించమన్నంత చెల్లించడానికి మన మన పిసినారి హృదయాలు సహకరించకపోతే పుణ్యాహవాచనం వంటి శుభకర్మలలో చెప్పబడిన ' దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదదే నమమ ' ప్రకారం ఉత్సాహంతో తోచిన సమర్పణ చేయవచ్చు.

సంఘశాఖలో భగవాధ్వజం ముందు మనం చేసిన సమర్పణే ధర్మరక్షణకోసం జరిగే నిజమైన సమర్పణ.

గురుదక్షిణ అనేది గురుపూర్ణిమకు ముందువెనుక ఏదో ఒకరోజు చేసేది. అదే ' గంగాజలి ' అయితే 365 రోజులూ చేసేది. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గురుపూజ చేస్తాం. ఆ ఒక్కరోజు మాత్రమే జేబులో ఉన్న ద్రవ్యం తీసి గురుదక్షిణ సమర్పించడం ఒక ఎత్తు. గురుపూజ చేసి గురుదక్షిణ సమర్పించిన మరుసటి రోజునుండే రాబోయే గురుపూజ నాడు సమర్పించడానికి సిద్ధంకావడం కోసమే  ' గంగాజలి ' వ్యవస్థ.

సమర్పణ ధనం మాత్రమే కాదు. సంఘకార్యం కోసం సమయ సమర్పణంకూడా చేయాల్సిందే.  ఇందులో ఆప్షన్ లేదు.

No comments:

Post a Comment