Monday, 11 September 2017

పార్థః కర్ణవధాయ త చ్ఛరగణం కృద్ధో రణే సందధౌ

(సౌజన్యం:సంఘ్ సంగీత గంగ)
(ఈపోస్ట్ చదివాక మన విజ్ఞాణం ఎలాంటిదో మీకు అర్థం అవుతుంది...ఇక ఆశ్చర్యపోవడం సాధారణమే..)
లీలావతీ గణితం:
సనాతనధర్మ గొప్పతనం:

పార్థః కర్ణవధాయ త చ్ఛరగణం కృద్ధో రణే సందధౌ
త స్యార్ధేన నివార్య త చ్ఛరగణం మూలై శ్చతుర్భిర్హయాన్
శల్యం షడ్భి ర థేషుభి స్త్రిభి రపి చ్ఛత్రం ధ్వజం కార్ముకం
చిచ్ఛే దాస్య శిర శ్శరేణ కతి తే యా వర్జున స్సందధౌ?

ఇది భాస్కరాచార్యులు  రాసిన లీలావతి గణితం అనే పుస్తకంలోనిది . ఇలాంటి శ్లోకాలతో  వున్న చిక్కు ప్రశ్నలెన్నో  వున్నాయి ఆ గ్రంథం లో. ఒక్కమాటలో  చెప్పాలంటే ఈ ఒక్క గ్రంథం ఆధారంగా చాలామంది PhD చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

పార్థ: అర్జునుడు, కర్ణవధాయ చ కర్ణుని సంహరించే సమయంలో,
తత్ శరగణం కృద్ధో కోపంతో రణే సంధధౌ: కర్ణుడు, అర్జునుడు యుద్ధంలో కోపంతో బాణాలు సంధించారు, తస్యార్ధే నివార్య  అంటే అర్జునుడు వేసిన వాటిలో సగం  కర్ణుడు వేసిన వాటిని నివారించడానికి ఉపయోగ పడ్డాయి.
తస్య మూలైశ్చతుర్భిః హయాన్: మిగిలిన వాటిలో వర్గమూలానికి నాలుగురెట్లు (4* square root) హయాన్ అంటే గుఱ్ఱాలను నిలువరించటానికి,
శల్యం  షడ్భిః: రథసారథి అయిన  శల్యుడిని నిలువరించుటకు ఆరు.
రధేషుస్త్రిభి ఛత్రం, ధ్వజం, కార్ముకం: మూడు బాణాలు రథం యొక్క గొడుగు, జెండా, ధనస్సు పడగొట్టడానికి,  చివరగా ఒక బాణం కర్ణుని శిరచ్ఛేదానికి ఉపయోగపడితే....
కతి తే యా వర్జున స్సందధౌ?: అర్జునుడు ఎన్ని బాణాలు వేసాడు?

ఇపుడు అర్జునుడు మొత్తం వేసిన బాణాలు X అయితే

X=X/2+4*√X+6+3+1

X=X/2+4√X+10 ఇలా లెక్క కడితే  మొత్తం బాణాల సంఖ్య 100.

ఈ శ్లోకాన్ని ఒక చిన్న లెక్కలాగా చదివితే జవాబు చాలా సులభం. కానీ మన సనాతన ధర్మంలో ఒక్కొక్క  శ్లోకంలో ఎన్ని అర్థాలు నిక్షిప్తం చేస్తారో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ.

ఇదే శ్లోకాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే...

అర్జునుడంతటి వీరుడికి వేసిన బాణాలలో సగం బాణాలను (50)  కర్ణుడు వేసినవాటిని నిలువరించటానికి పట్టిందంటే కర్ణుడు ఎంత గొప్ప విలుకాడో కదా...
ఇక గుఱ్ఱాలను నిలువరించటానికి 40 బాణాలు కావాల్సి వచ్చిందంటే, ఆ గుఱ్ఱాలకు ఎంత తర్ఫీదు ఇచ్చారో...
రథసారథికి 6 బాణాలు గుఱ్ఱాలకే 40 పడితే రథసారథి 6 కి లొంగిపోవటం ఏమిటి? అంటే శల్యుడు పాండవ పక్షపాతి అని తేలిపోయింది. ఇక మూడు బాణాలతో రథం, పడగొట్టాడు అంటే కర్ణుడి నిస్సహాయ స్థితి తెలుస్తుంది. ఇక ఒక్క బాణంతో కర్ణుడి తల తెగి పడింది.

దీనినే ఇంకొంత దీర్ఘంగా ఆలోచిస్తే రాజనీతి కనిపడుతుంది. యుద్ధంలో ముందుగా అవతలి వ్యక్తి వేసే బాణాలను ఎదుర్కోవాలనీ, తరువాత గుఱ్ఱాలని ఎదుర్కోవటం వలన అతను ఎక్కడికీ వెళ్ళలేడనీ, అప్పుడింక పారిపోకుండా రథ సారధిని ఎదుర్కొని ఇతనిపని అయిపోయింది అని చెప్పడానికి సూచికగా గొడుగునీ, జండానీ, విల్లునీ కొట్టి,  శాశ్వతంగా రాజు చిక్కినట్టే కనుక అప్పుడు ఒకే దెబ్బతో కన్నుమూసేలా వధించాలని తెలుస్తుంది. మరి ఇది రాజనీతి రహస్యమే కదా!

ఇంక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, కర్ణుడు వేసిన బాణాలు విషయ వాంఛలు అనుకుందాం. వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమయిన పని (అందుకే యాభై బాణాలు పట్టి ఉంటాయి). ఎప్పుడయితే వీటికి దూరంగా ఉంటామో అప్పుడే లక్ష్య సాధన చేకూరుతుంది. బాహ్య భోగాలకి దూరంగా ఉన్నాక ముఖ్యమయినది ఇంద్రియ నిగ్రహణ. గుఱ్ఱాలు ఇంద్రియాలకి ప్రతీకలు కదా. ఈ ప్రకారంగానే అర్జునుడు ముందుగా భోగాలని ఎదుర్కొని ఇంద్రియాలని నియంత్రించాడు (ఇది కూడా కష్టమయిన పనే). ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహణ జరిగిందో, బుద్ధి వశమవుతుంది. ఇక్కడ బుద్ధి అంటే రథ సారధి. ఇవన్నీ నియంత్రించగా మిగిలినవి మనస్సు, చిత్తము, అహంకారము. ఈ మూడూ వరుసగా గొడుగు, జెండా, విల్లు అనమాట. మొత్తం అంతా వశం అయిన తరువాత మిగిలినది జీవుడు (కర్ణుడు). అర్జునుడు ఆత్మ అనుకుంటే, జీవుడు ఆత్మలో చేరాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవే మోక్షానికి అర్హుడు కదా!

ఒక్కసారి శ్లోకాన్ని విఙ్ఞాన శాస్త్ర పరంగా కూడా ఆలోచిద్దాం. రోగ నిరోధక శక్తికి కాస్త అన్వయం కుదురుతుంది. మన శరీరంలోని కణాలు మొదటగా బయటనుంచి వచ్చే ప్రత్యర్ధులని (బాక్టీరియా, వైరస్, మొ.) ఎదుర్కొని, తరువాత వాని రాకకు ఆధారమయిన వాటిని నిర్జీవం చేసి అప్పుడు చంపేస్తాయి కదా.

ఇంకా ఈ శ్లోకానికి ఎన్ని రకాలుగా అర్థం అన్వయం చేయవచ్చొ మీ ఆలోచనా శక్తికి వదిలేస్తున్నాను...

అంతటి గొప్ప సనాతన ధర్మం

No comments:

Post a Comment